ట్రంప్‌ అధ్యక్షుడైతే వైట్‌హౌజ్‌లో తెలుగు తాలింపు

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి వాన్స్‌ సతీమణి ఉష చిలుకూరికి తెలుగు మూలాలున్నాయి.

By :  Raju
Update: 2024-07-16 12:20 GMT

సోమవారం జరిగిన రిపబ్లికన్‌ పార్టీ జాతీయ ప్రతినిధులంతా అమెరికా మిల్వాకీ కన్వెన్షన్‌ సెంటర్‌లో తమ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుకు అధికారికంగా ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహాయో సెనేటర్‌ జేడీ వాన్స్‌ పేరు ఖరారు చేశారు. దీంతో ఆయనతో పాటు ఉషా చిలుకూరు పేరు కూడా ఇప్పుడు పతాక శీర్షికల్లో కనిపిస్తున్నది.

మిడిల్‌టన్‌లో జన్మించిన జేడీ వాన్స్‌ మెరైన్‌ విభాగంలో అమెరికాకు సేవలందించారు. జేడీ వాన్స్‌ రచించిన హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం అత్యధికంగా అమ్ముడవడంతో పాటు సినిమాగా రూపొందింది. సాంకేతిక, ఆర్థికరంగాల్లో ఆయన వ్యాపారవేత్తగా విజయవంతమయ్యారు. వాన్స్‌ 2022లో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. ట్రంప్‌ విధానాలను మొదట్లో వ్యతిరేకించిన వాన్స్‌ చివరకు ఆయనకే విధేయుడుగా మారారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌, వాన్స్‌ గెలిస్తే ఆయనకు ఆంధ్రప్రదేశ్‌కు అనుబంధం ఏర్పడనున్నది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి వాన్స్‌ సతీమణి ఉష చిలుకూరికి తెలుగు మూలాలున్నాయి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఇంతవరకు న్యాయవాదిగా, సెనేటర్‌ సతీమణిగా కొంతమందికి మాత్రమే తెలిసిన ఉష చిలుకూరి అమెరికాలో ఒక్కసారిగా పతాకశీర్షికలకు ఎక్కారు. నవంబర్‌ 5న జరిగే తొలి ఇండో-అమెరికన్‌ ద్వితీయ మహిళగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. అయితే ఉపాధ్యక్షుడు వైట్‌ హౌజ్‌లో ఉండరు. కానీ అమెరికా పాలనా విధానాల్లో వాన్స్‌ కీలక పాత్ర పోషించనున్నారు.

ఆమె శాండియాగాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉషా చిలుకూరి యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్‌ చేశారు. లీగల్‌కు సంబంధించిన అంశాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమె సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద పనిచేశారు. ఉష, జేడీ వాన్స్‌ మొదటిసారి యేల్‌ లా స్కూల్‌లో కలుసుకున్నారు. 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. హిందు సంప్రదాయం ప్రకారమే వారి పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త జేరీ వాన్స్‌ విజయ ప్రస్థానంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆయనకు అనేక విషయాల్లో అండగా నిలిచారు. జేడీ వాన్స్‌ రచించిన హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తక రచనలో ఆయనకు సహాయపడ్డారు. ఒహాయో సెనేటర్‌గా జేడీ వాన్స్‌ పోటీ చేసినప్పుడు ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Tags:    

Similar News