భారత్‌లో కూర్చుని రాజకీయ ప్రకటనలు చేయొద్దు

షేక్‌ హసీనాకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్‌ యూనస్‌ ఖాన్‌ హెచ్చరిక

By :  Raju
Update: 2024-09-06 03:19 GMT

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరిగిన దాడులపై ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్‌ యూనస్‌ ఖాన్‌ స్పందించారు. రాజకీయ కారణాల వల్లనే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఇందులో మతపరమైన కోణమేమీ లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్‌లో ఈ అంశాన్ని ఎక్కువ చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

హిందువులు రాజకీయంగా హసీనాకు మద్దతిచ్చారనే అభిప్రాయంతోనే కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి చెప్పినట్లు యూనస్‌ వెల్లడించారు. ఈ అంశంలో అనేక కోణాలున్నాయని అన్నారు. షేక్‌ హసీనాతో అంటకాగిన ఆమె పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైనా దాడులు జరిగాయన్నారు. అయితే మైనారిటీలపై దాడులను తాను సమర్థించడం లేదన్నారు. ఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపారు. షేక్‌ హసీనా లేకుంటే బంగ్లాదేశ్‌ మరో అప్ఘనిస్థాన్‌లా మారుతుందనే వాదనను భారత్‌ విడనాడాలన్నారు. మైనారిటీలను బంగ్లా పౌరులుగానే చూస్తామని యూనస్‌ స్పష్టం చేశారు.

భారత్‌లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనాపైనా మహమ్మద్‌ యూనస్‌ ఖాన్‌ విమర్శలు చేశారు. ఆమె భారత్‌లో కూర్చుని రాజకీయ ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కోరేవరకు భారత్‌ లో మౌనంగా ఉండాలని కోరారు. హసీనా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని ఆయన అన్నారు. హసీనా మౌనం వహించకుండా సూచనలు చేస్తే ఎవరూ ఇష్టపడరని వ్యాఖ్యానించారు. దేశంలో జరిగిన దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే భారత్‌ నుంచి హసీనాను వెనక్కి తీసుకు రావాల్సిందేనని యూనస్‌ అభిప్రాయపడ్డారు. లేకపోతే బంగ్లా దేశ్‌ ప్రజలు శాంతించరని అన్నారు. ఆమె హాయంలో జరిగిన దురాగతాలపై అందరిముందు విచారించాల్సిందేనని పేర్కొన్నారు. 

Tags:    

Similar News