కార్గిల్‌ యుద్ధంలో మా సైనికులను కోల్పోయాం

మొదటిసారిగా ఒప్పుకున్న పాక్‌

Update: 2024-09-07 14:56 GMT

కార్గిల్‌ యుద్ధంలో తమ దేశ సైనికులను కోల్పోయామని పాకిస్థాన్‌ మొదటిసారిగా అంగీకరించింది. ఇన్నాళ్లు తాము భారత్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లలేదని, అసలు కార్గిల్ యుద్ధమే జరగలేదని అడ్డంగా వాదిస్తూ వచ్చిన దయాది దేశం కార్గిల్‌ యుద్ధం నిజమేనని, ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. కార్గిల్ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తర్వాత వాస్తవాన్ని ఆ దేశం ఒప్పుకుంది. శుక్రవారం రావల్పిండిలో డిఫెన్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ మాట్లాడుతూ, ఇండియా, పాకిస్థాన్‌ మధ్య 1948, 1965, 1971 యుద్ధాలు, సియాచిన్‌ ఘర్షణలు, కార్గిల్‌ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు త్యాగం చేశారని తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1999 మే నెలలో ఇండియా - పాకిస్థాన్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది. వేర్వేటువాద శక్తుల రూపంలో భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పాక్‌ బలగాలను భారత సైన్యం వీరోచితంగా పోరాడి తిప్పికొట్టింది. పాక్‌ సైన్యాన్ని భారత భూభాగం నుంచి తరిమి కొట్టామని ఇండియన్‌ ఆర్మీ 1999 జూన్‌ 26న అధికారికంగా ప్రకటించింది. ఇన్నాళ్లు కార్గిల్ యుద్ధంతో తమకెలాంటి సంబంధం లేదని పాకిస్థాన్‌ వాదిస్తూ వచ్చింది. కశ్మీరీ తిరుగుబాటు దారులతోనే భారత సైన్యం తలపడిందని, ఇందులో తమ ప్రమేయం లేదని.. కేవలం తమ సరిహద్దు వెంట గస్తీ మాత్రమే కాసామని చెప్తూ వచ్చింది. పాక్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ముషారఫ్‌.. ఆ దేశ డిప్యూటీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహ్మద్‌ అజీజ్‌ తో మాట్లాడిన ఫోన్‌ కాల్స్‌ ను ఇండియా బయట పెట్టింది. పాకిస్థాన్‌ సైన్యమే కార్గిల్‌ లోకి చొచ్చుకువచ్చిందని ఆధారాలు బయట పెట్టింది. ఇన్నాళ్ల తర్వాత దయాది దేశం తాము యుద్ధం చేసింది నిజమేనని అంగీకరించింది.

Tags:    

Similar News