లార్డ్స్‌ లో వరల్ట్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

వచ్చే ఏడాది జూన్‌ 11 నుంచి మ్యాన్‌.. ఒక రోజు రిజర్వ్‌ డే.. అధికారికంగా ప్రకటించిన ఐసీసీ

Update: 2024-09-03 15:22 GMT

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ ఫైనల్స్‌ క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ లోనే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జూన్‌ 11 నుంచి 15 వరకు ఈ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఏదైనా కారణాలతో ఒక రోజు ఆట సాగకపోతే 16వ తేదీన రిజర్వ్‌ డేన మ్యాచ్‌ కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు సార్లు టీమిండియా టైటిల్‌ రేసులో నిలిచినా ట్రోఫీ (గద) సాధించలేకపోయింది. ఫస్ట్‌ సీజన్‌ లో న్యూజిలాండ్‌, రెండో సీజన్‌ లో ఆస్ట్రేలియా ట్రోఫీ సాధించాయి. 2024 -25 సీజన్‌ లో ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో టాప్‌ -2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌ కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ ల ఆధారంగా పాయింట్ల పట్టికలో టీమిండియా, ఆస్ట్రేలియా టాప్‌ -2 లో ఉన్నాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మూడు, నాలుగో ప్లేస్‌ లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌ తో టెస్ట్‌ సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆరో స్థానంలోకి చేరింది. శ్రీలంక, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ లు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. ఒకానొక నాడు టెస్ట్‌ క్రికెట్‌ కు పర్యాయపదంగా చెప్పే వెస్టిండీస్‌ జట్టు కొన్నేళ్లుగా పట్టుకోల్పోతూ వస్తోంది.

Tags:    

Similar News