హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇద్దరు స్టార్‌ రెజ్లర్లు?

100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ను తన సోదరి బబితా ఫొగాట్‌పై పోటీ చేయించడానికి గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

By :  Raju
Update: 2024-08-21 05:13 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్టార్‌ రెజ్లర్లు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ను తన సోదరి బబితా ఫొగాట్‌పై పోటీ చేయించడానికి గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి రాబోనని వినేశ్‌ గతంలోనే ప్రకటించినప్పటికీ ఆమెను కొన్ని రాజకీయపార్టీలు సంప్రదించినట్లు తెలుస్తోంది.రాజకీయాలకు దూరంగా ఉండాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో చేరేది ప్రస్తుతానికి చెప్పలేమని ఫొగాట్‌ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

అయితే వినేశ్‌ ఫొగాట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వినేశ్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ నేత, ఎంపీ దీపిందర్‌ హుడా ఎయిర్‌పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు. అక్కడ భావోద్వేగానికి గురైన ఆమెను ఓదార్చిన వాళ్లలో ఆయన కూడా ఉన్నారు. ఫొగాట్‌ ఊరేగింపులోనూ ఆయన పాల్గొన్నారు. గతంలోనూ దీపిందర్‌ హుడా వినేశ్‌ను రాజ్యసభకు పంపాలని అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేశ్‌ సోదరి బబితా ఫొగాట్‌ 2019లో బీజేపీలో చేరారు. దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా కథనాలు వాస్తవమే అయితే ఫొగాట్‌ సిస్టర్స్‌ మధ్య పోరు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపే అవకాశం ఉన్నది. అలాగే మరో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Tags:    

Similar News