కెన్యా క్రికెట్‌ జ‌ట్టు కోచ్‌గా భార‌త మాజీ పేసర్

కెన్యా క్రికెట్‌ జట్టు ప్రధాన్‌ కోచ్‌గా భారత మాజీ ఆల్‌ రౌండర్‌ దొడ్డ గణేశ్‌ ఎంపిక‌య్యాడు.

By :  Vamshi
Update: 2024-08-14 13:02 GMT

కెన్యా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ దొడ్డ గణేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం జ‌రిగిన ఓ మీడియా ఈవెంట్‌లో ప్రధాన కోచ్‌గా గణేశ్‌ను కెన్యా క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఇక కెన్యా జ‌ట్టుకు కోచ్‌గా ఎంపిక కావ‌డం పట్ల సంతోషంగా ఉందంటూ గ‌ణేశ్ ట్వీట్ చేశాడు. ఇక‌పోతే భార‌తీయుల‌ను కోచ్‌గా పెట్టుకోవ‌డం కెన్యాకు కొత్తేం కాదు. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌ సందీప్ పాటిల్ కోచింగ్ లో ఆ జ‌ట్టు 2003 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. ఇప్పటివరకు కెన్యా 1996- 2011 మధ్య ఐదు ప్రపంచకప్‌లలో ఆడింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 20 జట్లలో వారు ఎక్కడా కనిపించరు. అలాగే ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో కెన్యా ప్రస్తుతం 33వ స్థానంలో ఉంది.

మలేషియా, స్పెయిన్, ఇటలీ, ఇతర దేశాల కంటే కెన్యా వెనుక‌బ‌డి ఉంది. ఇక కెన్యా ప్రధాన కోచ్‌గా గణేశ్‌ మొదటి అసైన్‌మెంట్ సెప్టెంబర్‌లో జరిగే ఐసీసీ డివిజన్ 2 ఛాలెంజ్ లీగ్‌. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా పాల్గొన‌నుంది. కెన్యా జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమే నా ముందున్న లక్ష్యం.సోషల్ మీడియాలో ఈ ఆటగాళ్ల మ్యాచ్‌లు చూశాను. వీరిలో ఆటపై అంకితభావం, పట్టుదల కనిపించాయి. నేను నా కొత్త రోల్‌ కోసం ఎదురు చూస్తున్నాను’ అని గణేశ్‌ పేర్కొన్నారు. 51 ఏళ్ల దొడ్డ గణేశ్‌ టీమ్‌ ఇండియా తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడారు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. గ‌ణేశ్‌ 1997లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాపై తన టెస్టు అరంగేట్రం చేశారు. అదే ఏడాది జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేశారు. అదే అత‌ని ఫ‌స్ట్ అండ్ లాస్ట్ వ‌న్డే. తన చివరి టెస్ట్ మ్యాచ్‌ని ఏప్రిల్ 1997లో వెస్టిండీస్‌తో ఆడాడు.

Tags:    

Similar News