'శెభాష్‌ మను' ప్రముఖుల ప్రశంసలు... ప్రధాని ఫోన్‌

పుష్కరకాల నిరీక్షణ తర్వాత భారత్‌కు షూటింగ్‌ విభాగంలో పతకం వచ్చింది. ఈ ఘనతను సాధించిన మను బాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.

By :  Raju
Update: 2024-07-28 18:37 GMT

పుష్కరకాల నిరీక్షణ తర్వాత భారత్‌కు షూటింగ్‌ విభాగంలో పతకం వచ్చింది. ఈ ఘనతను సాధించిన మను బాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కేంద్ర మంత్రులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారత కీర్తి పతాకను ఎగురవేసిన మను బాకర్‌కు అభినందనలు తెలిపారు.

 దేశం గర్వపడుతున్నది: రాష్ట్రపతి

ఒలింపిక్స్‌లో తన ప్రతిభతో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని చాటిన మను బాకర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆమెను చూసి దేశం గర్వపడుతున్నది అన్నారు. మను సాధించిన ఈ విజయం ఎంతో మంది క్రీడాకారులకు, మరీ ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు రాష్ట్రపతి ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

అద్భుతమైన ఆరంభాన్ని అందించారు: రాహుల్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకం సాధించినందుకు గర్వంగా ఉన్నదని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో అభినందించారు. మన అమ్మాయిలు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇంకా చాలా పతకాలు రావాలి అని రాహుల్‌ ఆకాంక్షించారు.

ఇదో అపూరూపమైన విజయం: మోడీ

కాంస్య పతకాన్ని సాధించిన మను బాకర్‌ను ప్రధాని మోడీ అభినందించారు షూటింగ్‌లో భారత్‌ తరఫున కాంస్య పతకం సాధించడంతో పాటు ఈ ఘనత అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించడం మరో ప్రత్యేకత అన్నారు. ఇదో అపూరూపమైన విజయమని ప్రధాని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని ఫోన్‌ చేసి అభినందించారు. విజయం పట్ల దేశమంతా ఆనందం వెల్లివిరిస్తున్నదని తెలిపారు. రజతం చేజారినప్పటికీ మీరు మన దేశం పేరు నిలబెట్టారని, ఈ విభాగంలో పతకం తీసుకొచ్చిన మహిళ మీరే అని కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో మీకు పిస్టల్‌ సహకరించలేదని, కానీ ఈసారి మాత్రం అన్ని లోపాలను అధిగమించారని ప్రధాని మనుతో అన్నారు. దీనికి మను అవును సర్‌. ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయని వాటిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను అన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రారంభమే ఇంత బాగున్నది. దీంతో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశానికీ పేరు వస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News