అనర్హతపై సవాల్‌ చేయనున్న ఐవోఏ

వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటుకు గురికావడంపై ప్రొటోకాల్‌ ప్రకారం భారత్‌ అప్పీల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

By :  Raju
Update: 2024-08-07 08:26 GMT

వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) సిద్ధమైంది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్‌ పోరులో తలపడిన ఫొగాట్‌ బుధవారం పొద్దున వరకే బరువు పెరగడంపైనా ఐవోఏ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. నంబర్‌ వన్‌ రెజ్లర్‌ సునాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం అందరినీ షాక్‌ గురి చేసింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్‌ చేసినట్లు కథనలు వస్తున్నాయి.

ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలి: పీటీ ఉషతో ప్రధాని

ఈ నేపథ్యంలో వినేశ్‌కు భరోసా ఇస్తూ ఎక్స్‌ వేదిగా పోస్ట్‌ చేసిన ప్రధాని ఈ అంశంపై ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషతో చర్చించారు. ఈ కేసుకు సంబంధించి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని సూచించారు. ఫొగాట్‌ అనర్హతకు సంబంధించి బలంగా నిరసన వ్యక్తం చేయాలని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా ఇది నిజం కాకపోతే బాగుండని వ్యాఖ్యానించారు.

దేశ ప్రజలెవరూ నిరాశ చెందవద్దు: మహవీర్‌ ఫొగాట్‌

వినేశ్‌ పొగాట్‌ పెద్దనాన్న మహవీర్‌ ఫొగాట్‌ స్పందించారు. పసిడి పతకం కోసం దేశమంతా ఎదురుచూసింది. అక్కడ నిబంధనలు ఉన్నాయి. కానీ ఎవరైనా రెజ్లర్‌ 50-100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని చెప్పారు. దేశ ప్రజలెవరూ నిరాశ చెందవద్దని ఆయన కోరారు. ఆమె ఏదో ఒక రోజు తప్పకుండా మెడల్‌ సాధిస్తుందని, తదుపరి ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధం చేస్తానని తెలిపారు.

వినేశ్‌ ఫొగాట్‌కు అస్వస్థత

మరోవైపు డీహైడ్రేషన్‌ వల్ల స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం పారిస్‌లోని ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News