మూసీ ప్రక్షాళనకు వరల్డ్‌ బ్యాంక్‌ రుణాలు

మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనే నిర్ణయం లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. రుణం తీసుకోవడానికి మున్సిపల్‌ శాఖ డీపీఆర్‌ రూపొందిస్తున్నది.

By :  Raju
Update: 2024-08-07 16:32 GMT

తెలంగాణ రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో మూడు రోజులుగా పర్యటిస్తున్నది. నాలుగో రోజు పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక పెద్దలతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. వాషింగ్టన్‌ డీసీలో గురువారం ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనే నిర్ణయం లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. రుణం తీసుకోవడానికి మున్సిపల్‌ శాఖ డీపీఆర్‌ రూపొందిస్తున్నది.

మూసీ ప్రాజెక్టు ప్రాధాన్యం, సుందరీకరణ పనులు, అభివృద్ధి మూలంగా నగర రూపురేఖలు మారడంతో పాటు పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉన్నది సీఎం ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు వివరించనున్నారు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషషన్స్‌ లో ఆర్సీసీఎం తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఆర్సీసీఎం సీఈవో గౌరవ్‌ సూరి, రేవంత్‌ రెడ్డి సమక్షంలో కంపెనీ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. అమెరికా వెలుపల మొదటిసారి తమ కంపెనీ విస్తరిస్తున్నట్లు సూరి వివరించారు. గొప్ప టాలెంట్‌ ఫోర్స్‌, సహజసిద్ధ లొకేషన్‌, నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్‌లో డేటా సొల్యుషన్‌ సర్వీస్‌లను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు వస్తాయని గౌరవ్‌ సూరి తెలిపారు.

వివింట్ ఫార్మా విస్తరణ

తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రపంచంలో పేరొందిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది.

ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే లైఫ్ సైన్సెస్‌కు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో ఈ కంపెనీ పెట్టుబడులకు సిద్ధపడటం అందరినీ ఆకర్షిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ, " జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు.

తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషధ కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో కొత్త కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, వివింట్ ఫార్మా కొత్త తయారీ కేంద్రం ఏర్పాట్లు తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి దోహదపడుతుందన్నారు. 

ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం

ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధికారికంగా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో భాగస్వామ్యం పంచుకుంటుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో ఈ కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

Tags:    

Similar News