రాష్ట్రానికి నిధులు అడగడానికి మాకు భేషజాలు లేవు: పొన్నం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని మంత్రి పొన్నం విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-27 05:05 GMT

హైడ్రా, మూసీ నది కోసం నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని విమర్శించారు.కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ప్రధాని కావాలనే తెలంగాణపై కక్షకట్టినట్టు మంత్రి విమర్శించారు.తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. బడ్జెట్‌ లో రాష్ట్రానికి అన్యాయం చేసిందని మేము విమర్శిస్తే బీజేపీ వాళ్లు అక్కడక్కడ మా దిష్టిబొమ్మలు తగులబెతున్నారు. బీజేపీ వారికి సిగ్గుండాలని మంత్రి విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం సాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదు. గతంలో స్మార్ట్‌ సిటీ వస్తే కరీంనగర్‌కు ఇచ్చారని, ఇప్పుడు హైదరాబాద్‌ నగరానికి స్మార్ట్‌ సిటీ నిధులు తీసుకురావాలన్నారు.

హైదరాబాద్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్‌ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉన్నదని మంత్రి తెలిపారు.కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు అడగడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసినందునే నిరసనగా సీఎం నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించినట్లు మంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. బీసీలకు ఏదైనా తప్పు జరిగితే బాధ్యత వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News