ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశాము : రేవంత్‌రెడ్డి

ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-15 10:33 GMT

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లక్షా 80 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసిన రైతులకు నీళ్లు ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి రాగానే ముందు ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు. నాలుగేళ్లుగా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయినా ఈ ప్రాంతంపై ఉన్న అక్కసుతోనే ప్రాజెక్ట్ పంపులను కూడా ఆన్ చేయలేదని తెలిపారు.

తాము నీళ్లు చల్లుకోలేదని.. ఆ గోదావరి తల్లే తమ మీద నీళ్లు చల్లిందని రేవంత్ హరీష్ రావుకు ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం తాము పడిన శ్రమను మాజీ మంత్రి హరీష్‌రావు చులకన చేసి మాట్లాడుతున్నారని.. అంత చిత్తశుద్ధే ఉంటే ప్రాజెక్ట్ పనులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టగా.. పంప్ హౌజ్ మోటర్లు పాడవకుండా ఉండేందుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల హడావిడి ఉన్నా.. ముఖ్యమంత్రి రేవంత్ సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం వచ్చారని తెలిపారు.

Tags:    

Similar News