జేపీసీకి 'వక్ఫ్‌' సవరణ బిల్లు

కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టి వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లుపై విపక్షాల డిమాండ్‌ మేరు జేపీసీకి పంపడానికి కేంద్రం అంగీకరించింది.

By :  Raju
Update: 2024-08-08 16:29 GMT

పార్లమెంటులో వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు కేంద్రం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో సుమారు 40 సవరణలు చేస్తూ కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చింది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల వాడీ వేడీ చర్చకు దారి తీసింది. చర్చల అనంతరం ఆ బిల్లును విపక్షాల డిమాండ్ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( (జేపీసీ)కి పంపుతామని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ఆయన ఈ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టే సమయంలో ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా నిరసించారు. ముస్లింలను టార్గెట్‌ చేయడానికి, రాజ్యాంగంపై దాడి చేసేందుకే ఈ బిల్లును ఉద్దేశించారని మండిపడ్డారు.

ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఖండించాయి. మైనారిటీ వారి సంస్థలను గౌరవించే ఆర్టికల్‌ 30 కి ఇది ప్రత్యక్ష ఉల్లంఘన అని డీఎంకే ఎంపీ కనిమెళి అన్నారు. ఓ వర్గాన్ని ఈ బిల్లు లక్ష్యంగా చేసుకున్నదని ఆమె ఆరోపించారు. ఈ బిల్లు దారుణమని, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ విమర్శించారు. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. కరుడుగట్టిన బీజేపీ మద్దతు దారులను బుజ్జగించడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ఇతర మత సంస్థల్లో అన్యమతస్తులను నియమించరని, కానీ వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరను నియమించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ఎన్సీపీ (శరద్‌పవార్‌) ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ బిల్లును తాము తిరస్కరిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూడండి. ఎంతో బాధగా ఉన్నది. మైనారిటీలను రక్షించడం ఈ దేశం నైతిక బాధ్యత అన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, దీనిపై చర్చ జరగాలన్నారు. న్యాయమైన, నిష్ఫాక్షికమైన బిల్లును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

చర్చ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ.. కొంతమంది వక్ఫ్‌ బోర్డులను తమ అధీనంలోకి తీసుకున్నారు. సాధారణ ముస్లింలకు న్యాయం చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చామని అన్నారు. వక్ప్‌ బోర్డులు మాఫియాగా మారిపోయాయని తనతోపలువరు ప్రతిపక్ష సభ్యులు అంతరంగిక సంభాషణల్లో చెప్పినట్లు వెల్లడించారు. వారి పేర్లు బైటపెట్టి వారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయదలుచుకోలేదన్నారు. గతంలో ఉన్న చట్టంలో ట్రిబ్యునల్‌ తీర్పు లో లేదా ఆదేశాలను సవాల్‌ చేయడానికి లేదా సమీక్ష చేయడానికి అవకాశం లేదన్నారు. ఇప్పుడు వాటిని హైకోర్టులో సవాల్‌ చేయడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. 1995 నాటి వక్ప్‌ చట్టంలో రాజ్యాంగాన్ని మించి ప్రొవిజన్లు ఉన్నాయని వాటిని మార్చకూడదా? అని ప్రశ్నించారు. తమిళనాడులో ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్‌ భూమిగా ప్రకటించారని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టంలో సవరణలు చేస్తున్నామన్నారు.

వక్ప్‌ చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారపార్టీ లోక్ సభ స్పీకర్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నట్లు అఖిలేశ్‌ ఆరోపించారు. స్పీకర్‌ తరఫున తాము పోరాడుతామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని ఖండించిన అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. ఇది స్పీకర్‌ను అవమానించడమేనని విమర్శించిన ఆయన ప్రతిపక్ష ఎంపీలు.. స్పీకర్‌ హక్కుల పరిరక్షకులు కాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వారించారు.

Tags:    

Similar News