హిట్‌మ్యాన్‌ మార్క్‌ కెప్టెన్సీ ఇది

ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ చేజారిపోకుండా కప్పు సాధించడంలో రోహిత్‌ నాయకత్వ ప్రతిభ దాగి ఉన్నది. టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి అంచున ఉన్న భారత్‌ను తన వ్యూహ చతురతతో గెలుపు తీరాలకు చేర్చాడు.

By :  Raju
Update: 2024-06-30 05:48 GMT

టీ 20 ప్రపంచకప్‌ నుంచి రిటైర్మెంట్‌ అవుతున్నట్టు ప్రకటించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భమిది. స్టార్‌ బ్యాటర్‌ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలకే రోహిత్‌ ఈ ప్రకటన చేయడం అభిమానులను ఆవేదనకు గురి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. పిచ్‌పై పడుకుని సాధించాను అన్నట్టు ఎమోషన్‌ అయ్యాడు. గెలుపు ఆనందాన్ని ఆయన కళ్లలో చూడవచ్చు.

ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ చేజారిపోకుండా కప్పు సాధించడంలో రోహిత్‌ నాయకత్వ ప్రతిభ దాగి ఉన్నది. ప్రెస్‌మీట్లలో సరదాగా కనిపించే రోహిత్‌ మైదానంలో వెళ్లగానే తన బ్యాట్‌తో బీభత్సం సృష్టిస్తాడు. ఈ హిట్‌ మ్యాచ్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు ముచ్చెమటలు పడుతాయి. క్లిష్ట సమయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావడం రోహిత్‌ ప్రత్యేకత. అందుకే 12 నెలల్లోనే 3 ఐసీసీ ప్రపంచకప్‌ (టెస్ట్‌, వన్డే, టీ 20) ఫైనల్స్‌ వరకు జట్టును నడిపించాడు. టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి అంచున ఉన్న భారత్‌ను తన వ్యూహ చతురతతో గెలుపు తీరాలకు చేర్చాడు.

వెస్టిండీస్‌ పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ రోహిత్‌ పట్టుబట్టి నలుగురు స్పిన్నర్ల (కుల్‌దీప్‌, అక్షర్‌, జడేజా, చాహల్‌)కోసం పట్టుబట్టాడు. అతని నిర్ణయంపై కొంతమంది పెదవి విరిచారు. కానీ మ్యాచ్‌లు మొదలయ్యాక అర్థమౌతుందని క్లుప్తంగా చెప్పి ఊరుకున్నాడు. అక్షర్‌ పటేల్ అవసరమా అన్నవాళ్లూ ఉన్నారు. టోర్నీ ముగిసే సరికి కుల్‌ దీప్‌ 10 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ ఆడిన 8 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సెమీస్‌లో ఏకంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్ దీర్ఘదృష్టి ఏమిటన్నది అప్పుడు అందరికీ అర్థమైంది. ఆటలో క్లాస్‌ శాశ్వతం, ఫామ్‌ అన్నది తాత్కాలిమని చెప్పిన రోహిత్‌ బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ ఫామ్‌పై నమ్మకంతో ఉన్నాడు. ఫైనల్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌ ఘోరంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యాను డిప్యూటీ గా తుది జట్టులోకి తీసుకొచ్చాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పాండ్యా ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, అమెరికా, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లలో భారత్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ చివరి ఓవర్‌ బాధ్యత తీసుకుని జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలాగే అర్షదీప్‌ బౌలింగ్‌లో చెలరేగిపోతున్న సమయంలో అతనినని మానసికంగా దెబ్బతీయడానికి పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇంజిమామ్‌ బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు చేస్తే.. రోహిత్‌ మీడియా ముందుకు వచ్చి 'ఇంజిమామ్‌ బుర్ర ఉపయోగించు' అని ఘాటుగా బదులిచ్చాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో కీలకమైన 19 ఓవర్‌లో జట్టు ఆశలను అర్షదీప్‌ నిలబెట్టాడు.

పిచ్‌, స్టేడియం కండీషన్లను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు ఎవరూ ఊహించని విధంగా బౌలర్లను ప్రత్యర్థులపై ప్రయోగించడంలో రోహిత్‌ శర్మది ప్రత్యేక శైలి. సిరాజ్‌, అక్షర్‌పటేల్‌, అర్షదీప్‌, కుల్‌దీప్‌లను పరిస్థితులకు అనుగుణంగా మ్యాచ్ లకు తీసుకుని ఫలితాన్ని సాధించాడు. పేసర్‌ బూమ్రా మ్యాచ్‌లో అవసరమైన చోట రంగంలో దింపడం కనిపించింది. ఫైనల్‌ ఇది స్పష్టమైంది.




 


తన కెరీర్‌లో 9 వరల్డ్‌ కప్‌లు ఆడిన విజయానికి రోహిత్‌ అర్హుడు అన్న కింగ్‌ కోహ్లీ మాటలు అక్షరాల నిజం. 2007 టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో అరంగేట్రం చేసిన రోహిత్‌ 159 మ్యాచ్‌లు ఆడాడు. 32.05 సగటులో 4231 రన్స్‌ చేశాడు. వీటిలో 5 సెంచరీలున్నాయి. ఇదే నా చివరి మ్యాచ్‌. ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడానికి ఇంత మంచి సమయం ఉండదని అన్నాడు. ట్రోఫీని ఎలాగైనా గెలువాలనుకున్నా, అనుకున్నది సాధించాను అని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. టీ 20 లీగ్‌ దశ నుంచి ఫైనల్‌ వరకు మాస్టర్‌ మైండ్‌ రోహిత్‌ తన మార్క్‌ కెప్టెన్సీని చూపెట్టాడు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో టీ20ల్లో 50 మ్యాచ్‌లు గెలిపించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు.

Tags:    

Similar News