విభజన హామీలు, బకాయిల విడుదలపై కేంద్రాన్ని కోరనున్న రాష్ట్రం

కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో నేడు నిర్వహించనున్న సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొననున్నారు.

By :  Raju
Update: 2024-06-22 02:41 GMT

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నేడు భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రమంత్రి సమాలోచనలు చేయనున్నారు. వార్షిక బడ్జెట్‌పై వారి సలహాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోవిభజన చట్టంలోని హామీలు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నది. కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో నేడు నిర్వహించనున్న సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొననున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్‌ కసరత్తు సమావేశం ఇది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సమావేశంలో భట్టి ప్రస్తావించనున్నారు.

ప్రధానంగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు సహా ఇతర బకాయిలు విడుదల చేయాలని కోరనున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు, స్కిల్‌ యూనివర్సిటీ తదితర కొత్త పథకాలకు నిధులు ఇవ్వాలని, బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని డిప్యూటీ సీఎం కోరనున్నారు. వీటితో పాటు రుణాలకు సంబంధించిన ఇతర అంశాలపై వెసులుబాటు ఇవ్వాలని భట్టి కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. 

Tags:    

Similar News