పంచాయతీ ఎన్నికలకు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సన్నద్ధం

సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా, 21న తుది ఓటర్ల జాబితా : ఎస్‌ఈసీ పార్థసారథి

Update: 2024-08-31 13:45 GMT

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సన్నద్ధమవుతోంది. శనివారం రాష్ట్రంలోని రికగ్నైజ్డ్‌, రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ పార్థసారథి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి 8న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు లేకుండా వార్డుల వారీ ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్‌ 6న ప్రకటిస్తామన్నారు. 9వ తేదీన జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 7వ తేదీ నుంచి 13 వరకు ఓటర్ల ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని.. వాటిని 19వ తేదీలోగా డీపీవోలు పరిష్కరించి 21న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. అర్హతగల ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే నమోదు చేయడానికి ఫామ్‌ -6, మార్పులు, తొలగింపుల కోసం ఫామ్‌ -8, ఫామ్‌ -7ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల గురించి రాజకీయ పార్టీలు ప్రస్తావించగా ఆ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. వార్డులకు కి.మీ. పరిధిలోనే పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వార్డుల విభజన సమయంలో ఒక కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే వార్డులో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుబంధ ఓటర్ల జాబితాలోని వారిని చివరి వార్డులో కాకుండా సంబంధిత వార్డులోనే చేర్చాలని పార్టీల ప్రతినిధులు సూచించారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




 


Tags:    

Similar News