రూ.113 కోట్లతో చెరువులు, కాల్వల తాత్కాలిక రిపేర్లు

వరద నష్టంపై పూర్తి స్థాయి అంచనాలు సిద్ధం చేయండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశం

Update: 2024-09-05 12:39 GMT

భారీ వర్షాలతో వరదలు పోటెత్తి తెగిన చెరువులు, కాల్వలకు వేగంగా రిపేర్లు చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం జలసౌధలో వరదలతో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కు వాటిల్లిన నష్టంపై సమీక్షించారు. ఆయా చెరువులు, కాల్వల రిపేర్టలకు అవసరమైన అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని, శుక్రవారం ఉదయమే ఆన్‌లైన్‌ లో షార్ట్‌ టెండర్లు పిలువాలని ఆదేశించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 245 చెరువుల కట్టలు తెగాయని, ప్రాజెక్టుల కాల్వలు తెగడం, షటర్లు కొట్టుకుపోవడం లాంటి సంఘటనలు ఇంకో 300 జరిగాయని ఇంజనీర్లు వివరించారు. మొత్తంగా 545 తాత్కాలిక పనులకు గాను రూ.113 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఈ పనుల శాశ్వత మరమ్మతులకు రూ.900 కోట్లు అవసరమని నివేదించారు. ముందు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, ఆయా చెరువులు, కాల్వలు పునరుద్దరించాలని మంత్రి ఆదేశించారు. వరదనష్టంపై పూర్తి స్థాయి అంచనాలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఆయా అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. విపత్తు సమయంలో ఇరిగేషన్‌ ఇంజనీర్లతో పాటు ఫీల్డ్‌ స్టాఫ్‌ అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. విధి నిర్వహణలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా ఉపేక్షించబోమన్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఏదైన సమస్య గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని రిజర్వాయర్లను ఫుల్‌ కెపాసిటీ వరకు నింపాలని ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, స్పెషల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీలు అనిల్‌ కుమార్‌, నాగేందర్‌ రావు, హరి రామ్‌, అడ్వైజర్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌, సీఈలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News