మూడో ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియాలో పరిస్థితులు: ట్రంప్‌

పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ పరస్పరం దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్నాయి.

By :  Raju
Update: 2024-08-26 05:20 GMT

పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ పరస్పరం దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్నాయి. దాడుల నేపథ్యంలో దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ ప్రకటించారు. దాడుల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని హెచ్చరించారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి అమెరికా ఏం చేస్తున్నదని, అధ్యక్షుడు జోబైడెన్‌, ఆయన పాలకవర్గాన్ని ట్రంప్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బైడెన్‌ కాలిఫోర్నియాలో సేద తీరుతున్నారని.. కమలా హారీస్‌ ప్రచారం పేరుతో దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కమలా హారిస్‌ నేతృత్వంలో అమెరికాకు భవిష్యత్తు ఉండదన్నారు. ఆమె ప్రపంచాన్ని అణుయుద్ధం దిశగా తీసుకెళ్తారని ఆరోపించారు.ఇటీవల తన నామినేషన్‌ను స్వీకరిస్తూ.. ఇజ్రాయిల్‌కు అండగా ఉంటామని హారిస్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

మరెవైపు హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టామంటూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ఒక వీడియో విడుదల చేసింది. తమపై దాడులు చేయడానికి హెజ్‌బొల్లా లెబనాన్‌లోని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని ఆరోపించింది. ఇజ్రాయెల్‌ పౌరుల ఇళ్లను, కుటుంబాలను రక్షించడానికే దాడి చేశామని వివరించింది.

ఇజ్రాయిల్‌ ఆస్పత్రిలో పాలస్తీనా బందీ మృతి

ఇజ్రాయిల్‌ ఆర్మీ జులై 23న వెస్ట్‌ బ్యాంక్‌కు చెందిన యువకుడు జహేర్‌ రద్దాద్‌ను అరెస్టు చేసింది. అతనిపై కాల్పులు జరిపి మిలటరీ వాహనాలకు మానవ కవచంగా వినియోగించింది. తాజాగా జహేర్‌ మృతితో పాలస్తీనా ఖైదీల మరణాలు 23కు చేరాయి.

మరోవైపు పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ పరస్పరం దాడులు, ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్‌ మెరుపు దాడి చేసింది. వంద యుద్ధ విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హెజ్‌బొల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని దీన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

Tags:    

Similar News