కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండె పోటుతో చనిపోయారు.

By :  Raju
Update: 2024-06-29 02:35 GMT

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటు చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో నిజామాబాద్‌లో డీఎస్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్‌ రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం తిరిగి ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు.

డీఎస్‌ 1948 సెప్టెంబర్‌ 27న నిజామాబాద్‌లో జన్మించారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. 1989, 1999, 2004 లో నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా పనిచేశారు. 2004-2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ మంత్రిగా సేవలు అందించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 

డీఎస్‌ కాంగ్రెస్‌పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా  పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ, కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషించారు. సోనియాగాంధీకి విధేయుడుగా ఉన్నారు. కాంగ్రెస్‌ దిగ్గజ నేతలు ప్రణబ్‌ముఖర్జీతో సహా చాలామంది ఏఐసీసీ సీనియర్‌ నేతలతో డీఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనపై నమ్మకంతోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించింది. వైఎస్‌ పాదయాత్రతో పాటు, అందరినీ సమన్వయం చేసి పార్టీ నడిపించిన డీఎస్‌ నాయకత్వ ఫలితంగా పార్టీ రెండుసార్లు అధికారంలో వచ్చింది. 

కాంగ్రెస్‌ పార్టీకి పార్టీకి విశిష్ఠసేవలు అందించారు: సీఎం

డీఎస్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘకాలం ఆయన పార్టీకి విశిష్ఠసేవలు అందించారు. డీఎస్‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags:    

Similar News