జనవరి నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం

సబ్సిడీ ధరలకు గోధుమలు కూడా ఇస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Update: 2024-08-22 14:13 GMT

రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డులకు జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటేరియట్ లో నిర్వహించిన స్టేట్ లెవల్ విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సన్నబియ్యం సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. సన్నబియ్యంతో పాటు అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలు పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ డీలర్లు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని, వారికి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్ షిప్ రద్దు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగకుండా అధికారుల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యంగా లేవని, విద్యార్థులకు సరిపడా బియ్యం అందడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం నాణ్యత మరింత మెరుగు పరచాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నాణ్యమైన బియ్యం నిర్దేశిత పరిమాణంలో సరఫరా చేస్తున్నారో లేదో పరిశీలించాలన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. 1,629 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. రేషన్ డీలర్లు, బియ్యం పంపిణీ ఇతర సమస్యలపై పది రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సివిల్ సప్లయీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ను మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News