ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్త ముచ్చటే: హరీశ్‌

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నమనే ప్రభుత్వ మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-13 13:28 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేశారు. మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కు అందని జీతాలు ఇప్పటివరకు అందలేదని, ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది ఎండగట్టారు.

ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నది. దీంతో ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నమనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. మోడల్ స్కూల్ టీచర్స్ కు గత 7 నెలల నుంచి ఏ నెలలో కూడా 1 వ తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 8 వ తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కారు, రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి మొత్తం 8 జిల్లాలో పని చేస్తున్న వెయ్యి మందికి పైగా రెగ్యులర్ టీచర్స్ కి ఇంకా వేతనాలు చెల్లించలేదు. వీరితో పాటు మోడల్ స్కూల్స్ లో పని చేసే ఔట్ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ (HBT) దాదాపు 2వేల మందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరం అన్నారు. అధికారంలోకి రాగానే 42 వేల రూపాయల వేతనం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, వారి ఉద్యోగ భవిష్యత్ ను దెబ్బతీసేలా కేవలం మార్చి31 నుంచి జులై 31 వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం మండిపడ్డారు. ఇందులో ఏప్రిల్, మే నెలల్లో సెలవులే ఉండగా, కేవలం జూన్, జులై నెలకు మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ నిర్ణయం వల్ల గత పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న1654 మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగాలు ఆపేస్తే, ఎలా బతికేది అని లెక్చరర్లు, వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విద్యాసంవత్సరానికి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వారు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరించాలి. అభయహస్తం మేనిఫెస్టోలో హామి ఇచ్చినట్లుగా గెస్ట్ లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు, నెలకు 42వేల వేతనం చెల్లించి, విద్యాసంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌ తెలిపారు. 

Tags:    

Similar News