భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి

ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు, ఎగువ నుంచి వస్తున్న వరదలకు భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది.

By :  Raju
Update: 2024-07-27 09:13 GMT

ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నది. ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు, ఎగువ నుంచి వస్తున్న వరదలకు భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 48 అడుగులు ఉన్న నీటి మట్టం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 52. 1 అడుగులకు చేరింది. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక అమలు చేస్తారు. వరదలతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేశ్‌ ఆదేశించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 1073.60 అడుగులకు చేరుకున్నది.వారం రోజులుగా పడుతున్న వానలకు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో.. 42 గేట్ల ద్వారా లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

నాగార్జున సాగర్‌

అటు నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 507. 20 అడుగులకు చేరుకున్నది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 125.97 టీఎంసీలు గా ఉన్నది. నాగార్జునసాగర్‌ ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 6,282 క్యూసెక్కులుగా ఉన్నది.

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో నిర్మల్‌ జిల్లా స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతున్నది. ప్రాజెక్టులోకి 2,700 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ఒక గేట్‌ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సింగూరు

సంగారెడ్డిలోని సింగూరు ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతున్నది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2991 అడుగులు కాగా... ప్రస్తుతం 14.06 టీఎంసీలుగా ఉన్నది. సింగూరు ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో 1,595, ఔట్‌ఫ్లో 391 క్యూసెక్కులు

శ్రీపాద ఎల్లంపల్లి

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరుచేరుతున్నది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 16.91 టీఎంసీలు ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో 14,349, ఔట్‌ ఫ్లో 331 క్యూసెక్కులుగా ఉన్నది.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 

Tags:    

Similar News