పర్యాటకుల సందర్శన కోసం పిల్లలమర్రి పున:ప్రారంభం

పున:ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పూర్వవైభవాన్ని సంతరించుకున్న పిల్లలమర్రి మర్రిచెట్టు...నేటి నుంచి సందర్శకులకు అనుమతి

By :  Raju
Update: 2024-08-21 07:45 GMT

పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పిల్లలమర్రిని పున:ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ...రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్నిరంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. తూర్పు మధ్య ఆసియా దేశాలకు మించిన పర్యాటక ప్రాంతాలు మనదేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం కేంద్రాలలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, టూరిజానికి మార్కెట్ కల్పించనున్నట్లు చెప్పారు. యాంత్రిక జీవనంలో టూరిజం వల్ల వినోదం కలుగుతుందన్నారు.

మహబూబ్ నగర్‌ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే రూ 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆసియా ఖండంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలుగాంచిన పిల్లలమర్రి చెట్టును పర్యటకులకు ఈరోజు నుండి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముఖ్యంగా నల్లమల అభయారణ్యం, మల్లెల తీర్థం, సోమశిల ,సరళసాగర్, కోయిల్ సాగర్ తో పాటు, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.వీటన్నిటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి గల కృష్ణానది ఉంది. కృష్ణ బ్యాక్ వాటర్ లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

రామప్ప గుడి, పాండవుల గుట్ట, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరు నెలలో కనీసం ఒక్కసారైనా మానసిక ఉల్లాసం కోసం పర్యాటక ప్రాంతాలు సందర్శించాలని కోరారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మహబూబ్ నగర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News