రేపు వాయనాడ్ లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేపు వాయనాడ్‌లో పర్యటించనున్నారు.

By :  Vamshi
Update: 2024-07-31 16:14 GMT

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేపు వాయనాడ్‌లో పర్యటించనున్నారు. నేరుగా బాదితులతో మాట్లాడనున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెల్లాచెదురైనవారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. తమ పర్యటనలో భాగంగా రాహుల్, ప్రియాంక మూడు పునరావాస శిబిరాలను సందర్శించనున్నారు. బాధితులకు తమ సంఘీభావం తెలిపి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి వందలామంది మృత్యువాతపడడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చలించిపోయారు. ఆయన మొన్నటివరకు వాయనాడ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవలి ఎన్నికల్లోనూ వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అదే సమయంలో, రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో, ఆయన వాయనాడ్ ను వదులుకుని, బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. తనను ఎంతగానో అభిమానించే వాయనాడ్ ప్రజలకు ఇలాంటి దుస్థితి రావడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 185 మందికిపైగా మరణించగా.. 200లకుపైగా వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. అయితే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయనిధికి ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమ కంపెనీ తరఫున రూ.5 కోట్ల సాయాన్ని సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పీ గ్రూప్‌ రవి పిళ్లై, లులు ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.5కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. వయనాడ్‌ ఘటనపై నటుడు విక్రమ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News