గ్రూప్‌-2 వాయిదా? కాసేపట్లో అధికారిక ప్రకటన

నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం గ్రూప్‌-2 వాయిదా వేయడానికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

By :  Raju
Update: 2024-07-18 08:31 GMT

డీఎస్సీ, గ్రూప్‌-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కొన్నిరోజులుగా చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గినట్టు తెలుస్తోంది. డీఎస్సీ, గ్రూప్‌-2 రెండింటిని వాయిదా వేయడం కుదరని చెప్పిన ప్రభుత్వం నిరుద్యోగుల నిరసనలను పరిగణనలోకి తీసుకోకుండా డీఎస్సీ పరీక్షలను నేటి నుంచి నిర్వహిస్తున్నది. అయితే పరీక్షల వాయిదా, గ్రూప్‌-2, 3 పోస్టుల పెంపుపై నిరుద్యోగులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఓయూ, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ, దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గ్రూప్‌-2 వాయిదా వేయడానికి సిద్ధమైనట్టు సమాచారం.

నిరుద్యోగుల డిమాండ్లు, గ్రూప్‌-2 వాయిదాకు సంబంధించి బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ భేటీ అయినట్టు తెలుస్తోంది. గ్రూప్‌-2 వాయిదాతో పాటు గ్రూప్‌-2,3 పోస్టుల సంఖ్య పెంపు అంశాన్ని నిరుద్యోగులు కాంగ్రెస్‌ నేతల దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనే డీఎస్సీ, గ్రూప్‌-2 రెండు పరీక్షలను వాయిదా వేస్తే మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమౌతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావడంతో గ్రూప్‌-2 వాయిదా వేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కాంగ్రెస్‌ నేతలు నిరుద్యోగులతో చెప్పినట్టు తెలుస్తోంది. నిరుద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై ప్రభుత్వం కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News