పాక్‌ దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది: ప్రధాని

పాకిస్థాన్‌ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్వేలేదని, శాంతి కోసం భారత్‌ తపిస్తే.. పాక్‌ తన నిజ స్వభావం చూపెట్టింది. ధర్మం ముందు అధర్మం, ఉగ్రవాదం ఓడిపోయిందని ప్రధాని అన్నారు.

By :  Raju
Update: 2024-07-26 06:34 GMT

కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌ ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులు అర్పించారు. లద్దాఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతాయన్నారు. సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుందని తెలిపారు. పాకిస్థాన్‌ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్వేలేదని, శాంతి కోసం భారత్‌ తపిస్తే.. పాక్‌ తన నిజ స్వభావం చూపెట్టింది. ధర్మం ముందు అధర్మం, ఉగ్రవాదం ఓడిపోయిందని అన్నారు. పాక్‌ దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉన్నాను. దేశం కోసం సైనికులు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది అన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. మౌలిక సౌకర్యాలు, పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కార్గిల్‌ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్‌ నిలుస్తుందిని పేర్కొన్నారు.

వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేం: రాష్ట్రపతి

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమరులకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 'భారత మాతను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నా నివాళి. 1999 కార్గిల్‌ యుద్ధంలో వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేం. దేశ ప్రజలు ఆ పరాక్రమం నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటారు. జై హింద్‌.. జై భారత్‌ అంటూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

 నివాళులు అర్పించిన త్రివిధ దళాలు 

కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌ సందర్బంగా భారత త్రివిధ దళాలు స్మారకం వద్ద నివాళులు అర్పించాయి. సీడీఎస్‌ చీఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించారు. భారత ఆర్మీ అధిపతి లెఫినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ యుద్ధ వీరుల స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు.

Tags:    

Similar News