అవగాహన ఉన్న అధికారినే డైరెక్టర్‌గా నియమించాలి: డాక్టర్‌ కాటం శ్రీధర్‌

తెలంగాణ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా ఐఏఎస్‌ అధికారిని కాకుండా..ఆ శాఖపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిన సీనియర్‌ అధికారినే నియమించాలని డాక్టర్ కాటం శ్రీధర్ కోరారు..

By :  Vamshi
Update: 2024-06-24 13:32 GMT

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి బి. గోపిని నియమించింది. అయితే దీనిపై తెలంగాణ వెటర్నిటీ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి కారణం ఈ శాఖకు సంబంధించిన మంత్రి లేకపోవడం, నిన్నటి వరకు సెక్రటరీ కూడా లేరు. దీంతో ఈ శాఖపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిన పశు సంవర్థక శాఖ సీనియర్‌ అధికారులను డైరెక్టర్‌ పదవిలో నియమిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని తెలంగాణ వెటర్నిటీ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కాటం శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పశు సంవర్థక శాఖలో నిత్యం వివిధ కార్యక్రమాలు, చికిత్సలు జరుగుతుంటాయి. కనుక ఈ శాఖపై సాంకేతిక నైపుణ్యాలు గల అధికారిని ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. అలాకాకుండా ఐఏఎస్‌లను నియమిస్తే వారు ఈ శాఖకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అప్పటికి మళ్లీ బదిలీలు జరిగితే మరో అధికారి వస్తారు. ఇట్లా ఐఏఎస్‌ అధికారులు రావడం వాళ్లు పశు సంవర్థక శాఖా పరమైన సమాచారం, కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. రైతులకు, ఈ శాఖపై జీవనోపాధి పొందుతున్న రైతులకు నష్టం జరుగుతున్నదని అన్నారు.

కనుక సీఎం రేవంత్‌ రెడ్డి పశు సంవర్థక శాఖలో నెలకొన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ పోస్టులో ఈ శాఖలోనే క్షేత్రస్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాలపై, పశువైద్య చికిత్సలపై అవగాహన కలిగిన, నిత్యం రైతులకు అందుబాటులో సీనియర్ అధికారులలో ఒకరికి డైరెక్టర్ పదవి ఇస్తే న్యాయం జరుగుతుందని శ్రీధర్‌ అన్నారు. 

Tags:    

Similar News