నీట్‌ పరీక్షను రద్దు చేయం.. ఎందుకంటే: సుప్రీం

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైంది. దానిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అందుకే పరీక్షను రద్దు చేయాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది.

By :  Raju
Update: 2024-08-02 07:29 GMT

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు వివరిస్తూ.. శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది.

నీట్‌ పేపర్ల లీకేజీ లో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృతస్థాయిలో లీక్‌ జరగలేదనిపేర్కొన్నది. లీకేజీ వ్యవహారం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైంది. దానిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అందుకే పరీక్షను రద్దు చేయాలనుకోవడం లేదని తెలిపింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) లోపాలను ఎత్తి చూపింది. విద్యార్థుల అభ్యున్నతిని దృష్టి పెట్టుకుని ఇలాంటి ఘటనలు భరించలేమని స్పష్టం చేసింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఏదే అని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఇస్రో మాజీ ఛీప్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ మరింత విస్తరించాలని పేర్కొన్నది. పరీక్ష విధానంలో లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబర్‌ 30లోగా తమ నివేదికను అందజేయాలని ఆదేశించింది. పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలు చేసే అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది. 

Tags:    

Similar News