ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Update: 2024-08-13 06:14 GMT

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించింది. మొదట కూటమి తరఫున అభ్యర్థిగా బైర దిలీప్‌ చక్రవర్తిని బరిలోకి దించాలని ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతలు ఆయన పేరు ప్రతిపాదించారు. ఆ మేరకు నాయకులు సీఎం, టీడీపీ అధినేత నేత చంద్రబాబుకు వారి అభిప్రాయాన్ని తెలిపారు. అయితే సంఖ్యపరంగా చూస్తే వైసీపీకి స్పష్టమైన బలం ఉన్నదని టీడీపీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టాలనుకుంటున్నదో అర్థం కావడం లేదని నిన్న నామినేషన్‌ సందర్భంగా బొత్స సత్యనారాయణ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గెలుపు కష్టమేమీ కాదని చంద్రబాబు నేతలతో చెప్పినప్పటికీ బలాబలాలను స్థానిక నేతలతో చర్చించిన అనంతరం పోటీ చేయకూడదని నిర్ణయించారు.

వైసీపీకి 530పైగా ఓట్లు ఉన్నాయని టీడీపీ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నదని వైసీపీ నేతలు నిన్న ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉండటమే మేలని సీఎం చంద్రబాబు భావించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషణ్ల స్వీకరణ గడువు నేటితో ముగియనున్నది. ప్రస్తుతం వైసీపీ తరఫున బొత్స, స్వతంత్ర అభ్యర్థిగా షేక్‌ సఫీ బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.

Tags:    

Similar News