మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. రాజీనామా చేయండి

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడీగా సాగుతున్నది. మేయర్‌, డిప్యూటీ మేయర్ల రాజీనామా కోసం బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.

By :  Raju
Update: 2024-07-06 06:27 GMT

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస వాతావరణం నెలకొన్నది. . బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియంను చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ప్లకార్డు ప్రదర్శించారు. ఫిరాయింపులను బీఆర్‌ఎస్సే ప్రోత్సహిస్తున్నదని ఆ పార్టీ కార్పొరేటర్లపై మేయర్‌ విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌ కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కి తగకపోవడంతో అసహనంతో మేయర్‌ సభను వాయిదా వేసి సీట్లో నుంచి వెళ్లిపోయారు. అనంతరం బటికి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ వాయిదాల పర్వం కొనసాగుతున్నది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కౌన్సిల్‌ సమావేశం రెండోసారి జరుగుతున్నది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అధికారపార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్‌ బేటీ రసవత్తరంగా మారింది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతలు రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.నగరంలో కబ్జాలు పెరుగుతున్నాయని, ప్రజారోగ్యానికి ప్రభుత్వానికి పట్టింపు లేదని బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ కౌన్సిల్‌ సమావేశానికి ఎమ్మెల్యే తలసాని సహా గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

మొత్తం 150 డివిజిన్లకు గాను ఎర్రగడ్డ, గుడి మల్కాపూర్‌ కార్పొరేటర్లు మరణించగా, ఎంఐఎం నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెలు అయ్యారు. ప్రస్తుతం సభలో 146 కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు 47, బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 41 మంది సభ్యులున్నారు.

Tags:    

Similar News