మహాలక్ష్మీ.. ఆర్టీసీకి అదృష్టలక్ష్మీ

ఆ పథకం ప్రారంభించిన తర్వాతే కొత్త బస్సులు కొన్నాం.. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Update: 2024-08-24 08:11 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 9న ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ఆర్టీసీకి అదృష్టలక్ష్మీ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం ఆర్టీసీ కళాభవన్‌ లో ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహాలక్ష్మీ పథకం ప్రవేశ పెట్టిన కొత్త బస్సులు కొంటున్నామని, 3,035 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్ల అవసరాలకు అనుగుణంగా సంస్థలో కొత్త బస్సులు కొంటున్నామని, ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. అమ్మ పురిటినొప్పులతో బిడ్డకు జన్మనిస్తుందని.. తాము గద్దెనెక్కిన తర్వాత అందిస్తున్న ప్రజాపాలన అలాంటిదేనన్నారు. మహాలక్ష్మీ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం రూ.2,750 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. సంస్థలో అంతర్గత పారదర్శకత అవసమని.. ప్రతి ఒక్కరూ అవార్డులు పొందేందుకు పోటీ పడాలన్నారు. కార్మికుల బాండ్స్‌ కు సంబంధించిన రూ.80 కోట్లు పేమెంట్‌ చేశామని.. ఇంకో రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాఖీ పండుగ రోజు సంస్థకు రూ.14.90 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సంస్థలో రాజకీయ జోక్యం ఉండదని, కార్మికులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కార్మికుల పీఎఫ్‌, సీసీఎస్‌ ఎరియర్స్‌ త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మికుల పిల్లల్లో ఇన్నోవేషన్‌ ప్రోత్సహిస్తామని, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులిస్తామన్నారు. సంస్థ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.కోటి బీమా వచ్చేలా యూనియన్‌ బ్యాంక్‌ తో ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు. సంస్థలో కారుణ్య నియమాకాలు చేపడుతామన్నారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల మరణించిన డ్రైవర్‌ మెరుగు సంపత్‌ కుటుంబ సభ్యులకు రూ.కోటి ప్రమాద బీమా చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News