ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఆంక్షల ఎత్తివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం ప్రకటించింది.

By :  Raju
Update: 2024-07-13 14:24 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేశారు. ఈ మేరకు ట్రంప్‌ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం మా బాధ్యత అని పేర్కొన్నది. అభ్యర్థుల ఆలోచనలను, మాటలు అమెరికా ప్రజలు వినాలని కోరుకుంటున్నాం. నిబంధనలకు లోబడి సోషల్‌ మీడియా ఖాతాను వినియోగించుకోవాలని, హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు చేయకూడదని మెటా సూచించింది.

2021లో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ అనుచరులు దాడిచేశారు. దీంతో ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ట్విటర్‌ ఖాతాలపై నిషేధం విధించారు. 2023లో వాటిని పునరుద్ధరించారు. అయితే ట్రంప్‌ భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని పేర్కొన్నది. అయితే గత ఏడాది ఆయన ఆంక్షలు ఎత్తివేసినా ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను వినియోగించలేదు. తన సొంత మీడియా 'ట్రూత్‌ సోషల్‌' వేదికగా ఆయన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో నిలిచిన జోబైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇద్దరి మధ్య ఇప్పటికే జరిగిన ముఖాముఖి చర్చలో ట్రంప్‌ కొంత పైచేయి సాధించినట్లు అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై మెటా నిషేధం ఎత్తివేయడం కొంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

Tags:    

Similar News