నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి: హరీశ్‌

నిరుద్యోగ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

By :  Raju
Update: 2024-07-14 15:07 GMT

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడానికి రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు. మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించి ఉసూరుమనిపించారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు. సమస్యకు పరిష్కారం చూపలేదు. ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నాను. ‘మావి కొత్త డిమాండ్లు కావు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు.

మీరు, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుపకంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడిక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికం. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులనూ బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని హరీశ్‌ డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ మీరు నిందారోపణలు చేయడం ఆక్షేపణీయం. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదు అన్నారు. నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరు. పైగా రెచ్చగొట్టినట్లుగా భావిస్తారు. ఉద్యోగ సమస్యల గురించి పోరాటం చేసిన మోతీలాల్ అనే విద్యార్థి, గ్రూప్ 1,2,3 పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను. నాడు హామీలు ఇచ్చినవారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ, నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారనే విషయాన్ని గుర్తించండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏ చిన్న అవకాశం దొరికినా నిరుద్యోగుల డిమాండ్ల పై స్పందించే వారు. మీరు కూడా నిరుద్యోగుల కోసం అప్పట్లో మౌన దీక్ష కు కూర్చున్న విషయం గుర్తున్నట్లు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తే మంచిది. ప్రతి అంశాన్ని రాజకీయం కోణంలో చూసే పద్ధతిని విడనాడాలి సూచిస్తున్నా. విద్యార్థులు, నిరుద్యోగులు అశాంతితో ఉన్న రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగటం అసాధ్యం. మాది ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే మీరు, నిరుద్యోగుల సమస్యల విషయంలో భేషజాలకు పోవడం సరికాదు. కంచెలు, ఆంక్షలు విధించి వారి గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని హరీశ్‌ లేఖలో పేర్కొన్నారు. అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహ్వానించాలి. సహృదయంతో వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకొని పరిష్కరించాలని కోరుతున్నాను.

లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన అంశాలు

1.గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలి.

1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారు. గ్రూప్ 1 పరీక్ష అనేది యు.పి.ఎస్.సి. మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలలు కన్న గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.

నేడు ఉపముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ భట్టి విక్రమార్క గారు గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1 :100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం కావటం లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు చేసిన డిమాండ్‌ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు ? ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు ? గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయండి.

2. గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది.

3. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. జులై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉంది. ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు.

4. మీరు అధికారం లోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. మేము ఇచ్చిన 5వేల పోస్టులకు మరో 6వేలు కలిపి 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నాను.

5. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆరు నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని, కోరుతున్నాను.

6, అదే విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయీ మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.

7, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జి.వో 46ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.

Tags:    

Similar News