కాళేశ్వరం జ్యుడిషయల్‌ కమిషన్‌ గడువు పెంపు

మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Update: 2024-08-31 13:17 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ జ్యుడిషయల్‌ కమిషన్‌ కాలపరిమితిని ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ నెలాఖరుతో ఆ కాలపరిమితి ముగియడంతో రెండు నెలల పాటు పొడిగించారు. ఇప్పుడు మరో రెండు నెలల పాటు కమిషన్‌ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అక్టోబర్‌ నెలాఖరు వరకు కమిషన్‌ విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు బ్యారేజీల్లో నిర్మాణం, డిజైన్‌ సహా ఇతర లోపాలపై కమిషన్‌ ఇంజనీర్లు, వర్క్‌ ఏజెన్సీలు, ఇతర సంస్థల నుంచి వివరాలు సేకరించింది. ఆయా వ్యక్తులు, సంస్థలు విచారణ సందర్భంగా వెల్లడించిన అంశాలపై సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ప్రస్తుతం ఓపెన్‌ కోర్టు ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ కాలపరిమితిని మరోసారి పొడిగించారు. ఈ రెండు నెలల్లోనైనా విచారణ పూర్తవుతుందా.. మరోసారి గడువు పొడిగించాల్సి వస్తుందా అనే దానిపై కమిషన్‌ తో పాటు ఇరిగేషన్‌ వర్గాల్లోనూ క్లారిటీ లేదు.




 


Tags:    

Similar News