కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

విద్యుత్‌ కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటును సవాల్‌ చేస్తూ కేసీఆర్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది.

By :  Raju
Update: 2024-06-28 08:05 GMT

విద్యుత్‌ కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటును సవాల్‌ చేస్తూ కేసీఆర్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. విద్యుత్‌ కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కేసీఆర్‌ వేసిన పిటిషన్‌పై అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. విద్యుత్‌ కమిషన్‌ కోసం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని, జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కేసీఆర్‌ కోరారు. కమిషన్‌ ఛైర్మన్‌ ఏక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని, విచారణ నిష్పక్షపాతంగా కొనసాగుతున్నదని ఏజీ వాదనలు వినిపించారు. ఇప్పటికే విద్యుత్‌ కమిషన్‌ 15 మందిని విచారించిందని, అందులో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు చాలామంది ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నిన్న హైకోర్టులో దీనిపై వాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్షతో కమిషన్‌ ఏర్పాటు చేశారని, కమిషన్‌ ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరించారని, విచారణ పూర్తి కాకుండానే కమిషన్‌ ఒక నిర్ణయానికి వచ్చిందని, కమిషన్‌ ఏర్పాటు చేసిన తీర్పుపై అభ్యంతరాలున్నాయని న్యాయవాది వివరించారు. అయితే కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణ అర్హత ఉన్నదా? లేదా అనే దానిపైనే నిన్న, ఇవాళ వాదనలు జరిగాయి. పిటిషన్‌కు అర్హత లేదని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా వాదనలు ముగిశాయి. హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ సాయంత్రం లేదా సోమవారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News