పలు రాష్ట్రాలకు మోగనున్నఎన్నికల నగారా

కేంద్ర ఎన్నికల సంఘం నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయనున్నది.

By :  Raju
Update: 2024-08-16 06:08 GMT

జమ్మూకశ్మీర్‌ సహా హర్యానా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎన్నికల సంఘం అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణపై అప్‌డేట్‌ ఇస్తుందని అనుకుంటున్న నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగానే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం అక్కడ పర్యటించి, పరిస్థితులను సమీక్షించింది. అంతకు కొన్నిరోజుల ముందు సీఈసీ జమ్మూకశ్మీర్‌, హర్యానా అధికారులతో భేటీ అయ్యారు.

నవంబర్‌తో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు గడువు ముగియనున్నది. ఝార్ఖండ్‌కు 2019లో చివర్లో ఎన్నికలు జరిగాయి. ఆ శాసనసభ పదవీ కాలం జనవరితో ముగియనున్నది. జమ్మూకశ్మీర్‌తో పాటు ఈ మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నదని సమాచారం. 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్‌, లద్దాక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.

పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం: ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్ననేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అత్యధిక స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News