200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఉత్త ముచ్చటేనా?

ప్రజల్లో నుంచి వస్తున్న నిరసల నేపథ్యంలో గృహజ్యోతి పథకంలో సవరణలు, మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది.

By :  Raju
Update: 2024-07-12 04:43 GMT

ప్రభుత్వ అట్టహాసంగా ప్రచారం చేసి, ప్రారంభించిన గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకున్నది. ఆ అప్లికేషన్లు ఏమయ్యాయో? ఎంతమంది ఈ పథకం వస్తున్నదో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్లా ఈ పథకం వర్తించక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మూడు నాలుగు సార్లు దరఖాస్తులు ఇస్తున్నారు. కానీ దీనిపై వారికి ఎలాంటి స్పష్టమైన సమాధానం దొరకడం లేదు.

అసలు ఈ పథకం రూపకల్పన, విధి విధానాల్లోనే చాలా లోపాలున్నాయి. ఇళ్లు లేని వాళ్లు కిరాయి ఇండ్లల్లోఉంటున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అదేమీ అమలవుతున్న కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ పథకం ద్వారా ప్రస్తుతం లబ్ధి పొందుతున్న వాళ్లలో అర్హుల కంటే అనర్హులే ఎక్కువమంది ఉన్నారని ప్రజాపాలన సేవా కేంద్రాల వద్ద దరఖాస్తులు ఇవ్వడానికి గంటల తరబడి నిలుచుంటున్న వారు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేస్తే అసలు విషయాలు బైటికి వస్తాయంటున్నారు. పేదల కోసం పనిచేస్తామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం మాట మీద నిలబబడలేదని మండిపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం వర్తించని వాళ్ల సంఖ్య చాలా ఉండటంతో, దరఖాస్తులు ఇచ్చిన వాళ్లు నిత్యం ఆయా కేంద్రాల్లోకి వెళ్లి ప్రశ్నిస్తుండటంతో ప్రస్తుతం ఆ సైట్‌ క్లోజ్‌ అయ్యిందని, అది ఎప్పుడు తెరుస్తారో తెలియదనే సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో నుంచి వస్తున్న నిరసల నేపథ్యంలో గృహజ్యోతి పథకంలో సవరణలు, మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది.

గృహజ్యోతి పథకం లబ్ధి దారులు ఇళ్లు మారినప్పుడు ఆహారభద్రతకార్డు, సర్వీస్ అనుసంధానం లోపాలతో ఆ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే వివిధ వర్గాల ద్వారా వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నది. పథకంలో సవరణలు, దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది.

ప్రజాపాలన సేవా కేంద్రాల్లో విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌ను సరిచేసుకోవడానికి, ఇళ్లు మారినా తిరిగి గృహజ్యోతి పథకం కల్పించేందుకు వెసులుబాటు కల్పించినట్టు టీజీఎస్పీడీసీఎల్‌ పేర్కొన్నది. గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల కరెంటు సరఫరా చేస్తున్నది.

Tags:    

Similar News