కోర్టు నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్‌ చర్యలు చేపట్టరా?

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోరా అని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ను ప్రశ్నించింది.

By :  Raju
Update: 2024-08-06 06:45 GMT

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోరా అని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ను ప్రశ్నించింది. ఇప్పటికే మూడు నెలల సమయం గడిచిపోయిందని.. కోర్టు నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్‌ చర్యలు చేపట్టరా? అని అడిగింది. బీఆర్‌ఎస్‌పై ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ...దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ నిర్వహించారు.

కోర్టులో పిటిషన్లను పెండింగ్‌లో ఉన్నంత వరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఇది రాజ్యాంగపరమైన అంశమని వాటిని కోర్టులు దాటలేవని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానందలు స్పీకర్‌ ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోనే హైకోర్టును ఆశ్రయించారని వాటిని పరిశీలించడానికి స్పీకర్‌కు తగిన గడువు కూడా ఇవ్వలేదన్నారు. స్పీకర్‌పై పిటిషనర్లు తీవ్ర ఆరోపణలు చేయడం సరికాదని..రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న స్పీకర్‌ నిర్ణయం తీసుకునే దాకా కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టులు వెలువరించిన పలు తీర్పులను అడ్వకేట్‌ జనరల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పిటిషన్‌ తీసుకోవడానికి స్పీకర్‌ కార్యాలయం నిరాకరించిందని.. హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే తీసుకున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించినట్లు ఆయన వాదించారు. స్పీకర్‌ నిర్దిష్ట గడువులోగా పిటిషన్లపై తేల్చాల్సి ఉన్నదని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. దీనిపై మరోసారి నేడు వాదనలు కొనసాగనున్నాయి. 

Tags:    

Similar News