కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 15 మంది మృత్యువాతపడగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.

By :  Raju
Update: 2024-09-02 02:51 GMT

వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకు 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నేడూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. రోడ్లు ధ్వంసం కావడంతో 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకు గండి పడగా, మరో 67 దెబ్బతిన్నట్లు వివరించింది. ప్రధాని నరేంద్రమోడీ సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి వరద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 15 మంది మృత్యువాతపడగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా నేడూ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు.

పాలేరు వాగు ఉధృతి.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

కామారెడ్డిలో అత్యధికంగా 25.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిన్నూరు (మెదక్‌)లో 17.3సెం.మీ మిర్దొడ్డి (సిద్దిపేట)లో 16.63 సెం.మీ, చిమన్‌పల్లి (నిజామాబాద్‌) 16.28 సెం.మీ, ఉట్నూరు (ఆదిలాబాద్‌)లో 15.8 సెం.మీ, జైనూరు (ఆసీఫాబాద్‌)లో 15.9, నేరెళ్ల (జగిత్యాల) 14.8 సెం.మీ, నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 14.4, పెంబిలో 13.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోదాడ, మోతె, అనంతగిరి మండలాల్లో పాలేరు వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీంతో గొండ్రియాల, చిమిర్యాల, నల్లబండగూడెం, రెడ్లకుంట, కూచిపూడి, తొగర్రాయి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల ప్రజలు రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కోదాడ పెద్ద చెరువు రెండురోజులుగా మత్తడి పోస్తున్నది.

ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు

మరోవైపు నిన్న మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్నారు. ధంసమైన రైల్వేట్రాక్‌కు సిబ్బంది శరవేగంగా మరమ్మతులు చేస్తున్నది. మధ్యాహ్నం వరకు ఒక లైన్‌లో మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉన్నది. సాయంత్రం వరకు మరమ్మతులు పూర్తికావొచ్చు

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై నిన్న మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు కోతకు గురైంది. హైదరాబాద్‌ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను మళ్లించారు. విజయవాడ నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్‌ వచ్చే వాహనాలను మళ్లించారు. హైదరాబాద్‌-విజయవాడ: నార్కట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు విజయవాడ-హైదరాబాద్‌: గుంటూరు, మిర్యాలగూడ, నార్కట్‌ పల్లి సూర్యపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.

అత్యవసరమైతే తప్పా ప్రజలు బైటికి రావొద్దు: కలెక్టర్‌ అనుదీప్‌

రెండురోజుల పాటు ఎడతెరిపి లేని వానలతో హైదరాబాద్‌లోని చాలా కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద పొంగుతుండగా.. హుస్సేన్‌ సాగర్‌ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేకచోట్ల భారీ వర్షాలు, కరెంట్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ సంస్థ-హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘట్‌కేసర్‌లో విద్యత్‌ షాక్‌తో ఒకరు, షాద్‌నగర్‌లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బైటికి రావొద్దని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు.

మున్నేరు మహోగ్రరూపం

వర్ష బీభత్సం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకధాటిగా పడిన జడివానతో ఊళ్లన్నీ ఏర్లను, రోడ్లన్నీ చెరువులను తలపించాయి కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మున్నేరు మహోగ్రరూపం దాల్చడంతో ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపింది. వరద చూస్తుండగానే ముంపు కాలనీలను చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇండ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనివిధంగా పాలేరు జలాశయం ఉగ్రరూపం దాల్చింది. భక్తరామదాసు పంప్‌హౌజ్‌ నీట మునిగింది. నాగార్జున సాగర్‌ కాల్వకు రెండు చోట్ల భారీ గండి పడింది. భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి జిల్లాల్లో ఐదుగురు మృతువాత పడగా.. ఇద్దరు గల్లంతయ్యారు.

ముంపు ప్రాంతాలు, బాధిత కాలనీల ప్రజలకే కాదు, అధికార యంత్రాంగానికి ఊహకందని విధంగా గంటల వ్యవధిలోనే వరద విలయం పోటెత్తింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముంపు ప్రాంతాలైన రామన్నపేట, దానవాయి గూడెం కాలనీ, గణేశ్‌నగర్‌, మేకల నారాయణ నగర్‌, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం సారథినగర్‌, పద్మావతి నగర్‌, వెంకటేశ్వర నగర్‌, బొక్కల గడ్డ, మోతీనగర్‌, పంపింగ్‌ వెల్‌రోడ్‌ బురద రాఘవాపురం, ధంసలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి.

Tags:    

Similar News