ఏపీలో భారీ వర్షాలు.. ఎనిమిది జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తున్నది. పలు జిల్లాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

By :  Raju
Update: 2024-08-31 03:56 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో రహదారులు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో ఎనిమిది జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.గుంటూరు, ఏలూరు, అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్‌ తదితర జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. మ్యాన్‌హోల్‌, కరెంట్‌ తీగలు తెగిపడే ప్రమాదాలు జరకుండా చూడాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు.

విజయవాడలో భారీ వర్షం పడుతుండటంతో మంత్రి నారాయాణ అధికారులను అప్రమత్తం చేశారు ప్రజలకు ఇబ్బందులు లేకుండ చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. మచిలీపట్నం భారీ వర్షం.. రహదారులపై నీరు ప్రవహిస్తున్నది.

విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రభుత్వ, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి నల్లవాగు, వైరా, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట-నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు-వీరులపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో రహదారులు జలమమయ్యాయి. ఎ. కొండూరు మండలం కృష్నారావు పాలెం-కేశ్వాతండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీలో మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్కరగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి భారీగా వాన పడుతున్నది.

Tags:    

Similar News