ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద ప్రవాహం

రాష్ట్రంలో పడుతున్న వానలతో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతున్నది.

By :  Raju
Update: 2024-07-25 04:02 GMT

భద్రాచలం వద్ద నిన్న గోదావరి వరద ఉధృతి కొంత తగ్గినట్టు కనిపించినా నేడు మళ్లీ పెరుగుతున్నది. ఉదయం 8 గంటలకు భద్రాచలం నీటిమట్టం వద్ద 47.1 అడుగులకు చేరింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నిన్న సాయంత్రం నుంచి క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది.

జూరాల

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.96 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు 42 గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 316.66 మీటర్లుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.18 టీఎంసీలు.

కడెం

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 692 అడుగులు. ప్రాజెక్టుకు 10,488 క్యూసెక్కుల వరద చేరుతున్నది. ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీరాంసాగర్‌

నిజామాబాద్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 18,894 క్యూసెక్కుల వరద ప్రాజెక్టుకు చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1071.50 అడుగులు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.96 టీఎంసీలు. నిజామాబాద్‌ జిల్లాలో పలుచోట్ల వానలు పడుతున్నాయి. డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, మోపాలలో విస్తారంగా వానలు పడుతున్నాయి.

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి నాలుగు ఓపెన్‌ కాస్టు గనుల్లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

శ్రీశైలం

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్న ది. జూరాల నుంచి శైశైలానికి 1,92,302 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 852.50 అడుగులుగా ఉన్నది. 

Tags:    

Similar News