పోస్టింగ్‌ల కోసం గురుకుల టీచర్‌ అభ్యర్థుల నిరసన బాట

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గురుకుల టీచర్ల అభ్యర్థులు నిరసన బాట పట్టారు. అలాగే ఏఈఈ అభ్యర్థుల సర్టిఫికెట్‌ పూర్తయినా అపాయింట్‌మెంట్స్‌ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు.

By :  Raju
Update: 2024-06-14 06:27 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గురుకుల టీచర్ల అభ్యర్థులు నిరసన బాట పట్టారు. తమకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకాలం ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపెట్టి పోస్టింగులు ఇవ్వలేదని, ఇప్పుడు కోడ్‌ ముగిసినా ప్రభుత్వం స్పందించడం లేదని వాళ్లు మండిపడుతున్నారు. వాళ్లు ఇవ్వని నోటిఫికేషన్లు, నిర్వహించని పరీక్షలు తమ ఘనతగా చెప్పుకోవడం తప్ప నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల టీచర్‌ అభ్యర్థుల సమస్యలపై బోర్డు నుంచి సరైన స్పందన లేకపోవడంతో సీఎం ఇంటిముందు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అలాగే ఏఈఈ అభ్యర్థుల సర్టిఫికెట్‌ పూర్తయినా అపాయింట్‌మెంట్స్‌ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు.

కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని?

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ మేనిఫోస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ప్రకటించింది. ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎప్పుడు ఏ నోటిఫికేషన్‌ విడుదల కానున్నది? పరీక్ష నిర్వహణ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని అందులో పేర్కొన్నది. ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయ్యాయి. కానీ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. గత ప్రభుత్వ హయాంలో 1,30,000 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. నాటి ప్రభుత్వం ఆ వివరాలను అంకెలతో సహా వివరించింది. కానీ నిరుద్యోగులను రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త నోటిఫికేషన్లు ఏవీ ఇవ్వలేదు. గ్రూప్‌-1లో 60 పోస్టులు, డీఎస్సీలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా కొన్ని పోస్టులు మంజూరు చేసింది. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను, నిర్వహించిన పరీక్షలను, ఫలితాలు విడుదలైనా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగించింది. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు ఎన్ని అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

నియామక పత్రాలు ఏవి?

నియామక పత్రాలు అందుకున్న వారు పోస్టింగుల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పోస్టింగులు ఇవ్వలేకపోతున్నామని తప్పించుకునే ప్రయత్నం చేసింది. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు లోక్‌సభ ఎన్నికల కోసం హడావుడిగా చేసిన ప్రభుత్వ ప్రయత్నాలు ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి. నిరుద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఉత్తమాటలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల టీచర్‌ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి ముందు మోకాళ్లపై నిలబడి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. అలాగే తమకు జీతాలు రావడంలేదని నర్సింగ్‌ స్టాఫ్‌ నిరసన తెలిపారు. మార్చిలో 1:2 రేషియోలో అభ్యర్థులను సర్వీస్‌ కమిషన్‌ సెలక్ట్‌ చేసింది. డాక్యుమెంటేషన్‌ వెరిఫికేషన్‌ పూర్తై నెలలు గడుస్తున్నా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదంటూ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌) ఏఈఈ అభ్యర్థులు గాంధీభవన్‌ దగ్గర నిరసన తెలిపారు. మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు. డాక్యుమెంటేషన్‌ జరిగిన మూడు నెలలు గడిచినా అపాయింట్‌మెంట్‌ లేటర్లు ఇవ్వలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుణపాఠం తప్పదు

ఏడు నెలల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరునకు ఈ పరిస్థితులు అద్దం పడుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలువడం కోసమే అలవిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని, ఇదేమిటి అన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నదని అంటున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి తగిన సమయంలో గుణపాఠం చెబుతామంటున్నారు.

Tags:    

Similar News