ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశం

Update: 2024-09-01 09:47 GMT

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో ఆదివారం సెక్రటేరియట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా కాపాడగలిగామన్నారు. రాష్ట్రంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, మరింత వరద వస్తే తెగే ప్రమాదముందన్నారు. మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టామని, ఇంకా ఎలాంటి పరిస్థితు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పంపిస్తున్నామని తెలిపారు. సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 45 పునరావాస కేంద్రాలను తెరిచామని, 2,500 మందిని ఆయా కేంద్రాలకు తరలించామని తెలిపారు. పాత భవనాలు, ఇండ్ల వద్ద నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆయా భవనాలు కూలిపోయే పరిస్థితి ఉంటే.. అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, తెలంగాణా స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో 26 ప్లాటూన్ ల రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్‌ తెగిపోవడంతో రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, నీళ్లు అందజేశామని.. వారిని తమ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News