బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : పువ్వాడ

వరదను అంచనా వేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

By :  Vamshi
Update: 2024-09-02 11:12 GMT

వరదను అంచనా వేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. జలమయమైన కాలనీలను, లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరదల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. వాతావరణ శాఖ వారం రోజులుగా భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసిన.. ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వలేదని పువ్వాడ అన్నారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు.

ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం చేస్తున్నారన్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి.. పొంగులేటీ.. అన్నా-అక్కా అంటూ తిరగావు కదా ఇప్పుడు ఎక్కడున్నవ్‌? వెంటనే ఇక్కడికి రావాలి’ అంటూ ఖమ్మం నగర ప్రజలు ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ముందస్తు హెచ్చరికలు చేసేవారని వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేదని చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేవారని వెల్లడించారు. మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు.

Tags:    

Similar News