ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత

త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతున్నది. త్రివేణి సంగమం వద్ద 7 మీటర్ల పైగా ఎత్తులో వరద కొనసాగుతున్నది.

By :  Raju
Update: 2024-07-19 05:02 GMT

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకున్నది. త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతున్నది. త్రివేణి సంగమం వద్ద 7 మీటర్ల పైగా ఎత్తులో వరద కొనసాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరుగుతున్నది. మేడిగడ్డ బ్యారేజికి 1,93,550 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్‌ వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతున్నది. లోలెవల్‌ వంతెన పై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. దీంతో కాటారం-మేడారం ప్రధాన రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రివరకు కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగింది. కాటారంలో అలుగువాగు దాటుతుండగా కారు కొట్టుకుపోయింది. గ్రామస్తుల సాయంతో కారు డ్రైవర్‌ సురక్షితంగా బైటపడ్డాడు.

గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. నిన్న 20 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం నేడు ఉదయానికి 25 అడుగులకు చేరింది. రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలకు వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. తాళిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్మగూడెంలోని సీత వాగు ఉధృతంగా గోదావరిలో కలుస్తున్నాయి. భద్రచలం స్నాగ ఘట్టాల వరకు నీరు చేరింది.

కడెం

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నది. 5,437 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 688.35 అడుగులుగా ఉన్నది.

జూరాల

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 20 వేలు, ఔట్‌ ఫో 22, 877 క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 315.850 మీటర్లు. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీలు. 

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలల్లి 2, 3 గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 6 వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోగా.. సుమారు కోటి రూపాయల నష్టం జరిగిందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద మోటార్లతో నీటిని బైటికి పంపిస్తూ బొగ్గు ఉత్పత్తి పనులు చేయడానికి కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాడిచెర్ల గనిలోనూ వరద నీరు చేరి 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌ కాస్ట్ గనుల్లో బొగ్గుతో పాటు మట్టి తీసే పనులు ఆగిపోయాయి.

Tags:    

Similar News