భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

By :  Vamshi
Update: 2024-07-27 11:44 GMT

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో వరద నీరు శనివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 52 అడుగులు దాటింది. వరద నీరు పెరగడంతో కొన్ని గంటల్లోనే భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులు తాకింది. మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో, దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతితో భద్రాచలం పరిసర ప్రాంతాలకు రవాణా స్తంభించింది. దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో ప్రధాన రహదారులు నీట మునిగి రాకపోకలు బంద్ అయ్యాయి. స్థానిక ఏఎంసీ కాలనీ చుట్టుపక్కల బ్యాక్ వాటర్ చేరుకోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. వరద నీటిలోకి దిగొద్దని స్పష్టం చేసింది.

Tags:    

Similar News