పీడిత ప్రజల గొంతుక గద్దర్..అతని పాటలే తూటాలు : అల్లం నారాయణ

పీడిత ప్రజల గొంతుకని, అతని పాటలే తూటాలని ప్రజా యుద్ద నౌక గద్దర్ సేవలను మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు.

By :  Vamshi
Update: 2024-08-06 15:15 GMT

ప్రజా యుద్ద నౌక గద్దర్ వర్థంతి సభ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు దళి వర్గానికి చెందిన గద్దర్.. విప్లవపార్టీకి రక్తం ధారపోశారని మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గుర్తు చేశారు. విప్లవ ఉద్యమంలో నలభై ఏళ్లు తన జీవితాన్ని కొనసాగించారని, నక్సల్స్ ఉద్యమం నుంచి శ్రీకాకుళం పోరాటాల వరకు తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను ఆయన వేసుకున్నారని వివరించారు.. గద్దర్ లేకుండా తెలంగాణ రాలేదని అని స్పష్టం చేశారు. రివిజనిజాన్ని బద్దలు కొట్టిన చారుమజుందార్ నక్సల్బరీ ధార వెంట నడిచిన ఘనుడు గద్దరన్న అని వివరించారు.

ఈ సభలో గద్దర్ తనయుడు సూర్యం మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గద్దర జీవన పోరాటానికి చిహ్నంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గద్దర్ జీవితాశయానికి ఈ ఫౌండేషన్ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పీడిత ప్రజల గొంతుకని, అతని పాటలే తూటాలని కొనియాడారు. గద్దర్ నడిపిన సాంస్కృతిక ఉద్యమ వారసత్వాన్ని తామూ కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిన చేశారు.యుద్ధ నౌక.. భూస్వాముల అణచివేత, ప్రభుత్వ దోపిడీని, పాలకులను ధిక్కరించారన్నారు.

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. స్వరాష్ట్ర కాంక్షను మనలో రగిల్చారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును సైతం తిరస్కరించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. విప్లవ, సాంస్కృతిక గేయాలతో యుద్ధ నౌకకు ప్రజా సంఘాలు ఘనంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాయి. నన్నూ గన్న తల్లూలార, తెలుగూ తల్లి పల్లేల్లారా అంటూ.. ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క, సీపీఐ నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, టీజేసీ మాజీ అధ్యక్షుడు కోదండరామ్, మా భూమి నరసింగరావు, పాశం యాదగిరి, నందిని సిద్ధారెడ్డి, కంచె ఐలయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు,గోరేటి వెంకన్న, అందెశ్రీ, చిక్కడు ప్రభాకర్, బుర్ర రాములు తదితర కవులు పాల్గొన్నారు.

Tags:    

Similar News