ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినా అదే వివక్షా?

తెలంగాణ పై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని, సాబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారని కేటీఆర్ విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-27 05:16 GMT

ప్రధాని మోడీ తెలంగాణపై మొదటి నుంచి ద్వేషం నింపుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో 20 మెట్రో ప్రాజెక్ట్ లకు నిధులిచ్చి హైదరాబాద్ మెట్రో కు మాత్రం గుండుసున్నా ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్నవివక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ పై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారు. ఎన్నిసార్లు తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్ లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భావించిన తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఏం ప్రయోజనమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. మరి మన రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ ఎనిమిది సీట్లు ఇచ్చింది .రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తు చేశారు.

ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్ట్ లకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు.

ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు) - రూ. 5,134.99 కోట్లు

మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు) - రూ. 4,109 కోట్లు

గుజరాత్ (3 ప్రాజెక్టులు) - రూ. 3,777.85 కోట్లు

ఢిల్లీ (2 ప్రాజెక్టులు) - రూ. 3,520.52 కోట్లు

కర్ణాటక- రూ. 1880.14 కోట్లు

మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు) - రూ. 1,638.02 కోట్లు

బీహార్ - రూ. 1,400.75 కోట్లు

తమిళనాడు - రూ. 713 కోట్లు

కేరళ (2 ప్రాజెక్టులు) - రూ. 146.74 కోట్లు

రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ (ఢిల్లీ-ఘజియాబాద్) - రూ. 1,106.65 కోట్లు

గత పదేళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్ట్ ల కోసం మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News