మహబూబాబాద్‌ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం: రేవంత్‌

ఎన్ని చర్యలు చేపట్టినా కొంత ప్రాణ నష్టం జరిగడం బాధాకరమన్న సీఎం

By :  Raju
Update: 2024-09-03 09:47 GMT

మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పర్యటించిన సీఎం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సహాయ చర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని సీఎం అభినందించారు.

ఎన్ని చర్యలు చేపట్టినా కొంత ప్రాణ నష్టం జరిగిందన్నారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగాం. ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తాం. నష్టపోయిన మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం భరోసా కల్పించారు. నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలన్నారు. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం పరిశీలనకు ప్రధాని మోడీని ఆహ్వానించాం. తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి రూ. 2 వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. వర్షం తగ్గినందున బురద తొలిగించే పనులు అధికారులు ప్రారంభించాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చు. విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నదని, మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.

చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలను ఎలాంటి పరిస్థితిలో సహించేదిలేదన్నారు. ఆక్రమణలు ఉంటే తొలిగించాలని ఆదేశించారు. అంతకుముందు మహబూబాబాద్‌ జిల్లా సీరోల్‌ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ పోరిక బలరాంనాయక్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆ ప్రాంతం మొత్తం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News