పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు సీఎం బృందం

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనున్నది.

By :  Raju
Update: 2024-08-03 04:55 GMT

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాల్లో సహా దక్షిణ కొరియాలోని సియోలును సందర్శించనున్నారు. అమెరికాలో 8 రోజులు, దక్షిణ కొరియాలో 2 రోజులు సీఎం బృందం పర్యటించనున్నది. ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు.

ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనున్నది. సీఎం వెంట సీఎస్‌ శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఈ నెల 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్తారు.

ఈ నెల 9వ తేదీ వరకు న్యూయార్క్‌, వాషింగ్టన్‌, డల్లాస్‌ , శాన్‌ ఫ్రాన్సిస్కో లలో పర్యటించి పలు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం బృందం భేటీ కానున్నది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సీఎం ప్రవాస భారతీయులను సమావేశం కానున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బృందం నేడు న్యూయార్క్‌కు చేరుకుంటుంది. ఈ నెల 4న న్యూజెర్సీలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 5వ తేదీన కాగ్నిజెంట్‌ సీఈవో సహా ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్‌ జోయిటస్‌ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్‌ వో సంస్థ సీవోవో శైలేష్‌, ర్యాపిడ్‌ 7 ప్రతినిధులతోనూ సమావేశమౌతారు. ఈ నెల 6న పెప్పికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. అనంతరం న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌కు సీఎం బృందం చేరుకుంటుంది.

ఈ నెల 11న అమెరికా నుంచి బయలు దేరి దక్షిణ కొరియాకు చేరుకుంటారు. 12వ తేదీన యూయూ ఫార్మాతో, కొరియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ, ఎల్‌ ఎస్‌ హోల్డింగ్ష్‌, హ్యుందాయ్‌ మోటార్స్‌ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. 13న హాన్‌ రివర్‌ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్‌ జూ యంగ్‌ టాయ్‌తో సమావేశమౌతారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం పాల్గొంటారు. సామ్‌ సంగ్‌, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌ బృందం చర్చలు జరపనున్నది. ఈ నెల 14న ముఖ్య మంత్రి బృందం హైదరాబాద్‌కు తిరిగి రానున్నది.  

Tags:    

Similar News