రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించినసీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నది.

By :  Raju
Update: 2024-08-14 06:34 GMT

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించినసీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నది. ముఖ్యమంత్రితో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు విదేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఉత్సాహం చూపెట్టారు. ఫ్యూచర్‌ సిటీ విషయంలోనూ చాలా మంది ఆసక్తి చూపెట్టారు.రాబోయే రెండుమూడేళ్లలో రాష్ట్ర ప్రగతి ఎన్నివిధాలుగా ముందుకు వెళ్తుందో చూపెడుతామన్నారు. కాగ్నిజెంట్‌ సంస్థలతో పాటు ఇతర కంపెనీలు తెలంగాణలో, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. వారికి ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి పర్యటించారని శ్రీధర్‌బాబు చెప్పారు. అధునాతన, గ్రీన్‌ సిటీగా, ఫ్యూచర్‌ సిటీ గా రాబోయే కాలంలో ప్రత్యేక నగరంగా ముచ్చర్లను నిర్మాణం చేయాలనే ఆలోచనను ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌, మన పారిశ్రామికవేత్తలతో, ఇతర దేశాలకు చెందిన పెద్దలందరితో మాట్లాడామని చెప్పారు.

నేడు సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్‌ నూతన క్యాంపస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనిద్వారా కొత్తగా 15 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ నెల 5న అమెరికాలోని న్యూజెర్సీలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్‌ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. నూతన కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిసియల్‌ ఇంటలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికలపై కొత్త క్యాంపస్‌ ఫోకస్‌ పెట్టనున్నది. 

Tags:    

Similar News